కరోనాపై ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్షలు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ లక్షణాలు కలిగిన రాయ్‌పూర్‌కు చెందిన 37 ఏళ్ల యువతిని అర్దాంతరంగా ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జి చేసిన రాయ్‌పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ‘రామకృష్ణ కేర్‌ హాస్పటల్‌’కు చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ‘ఎపిడెమిక్‌ డిసీసెస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1897’ కింద నోటీసు జారీ చేసింది. కరోనా వైరస్‌ విస్తరించకుండా ఈ చట్టంలోని రెండవ సెక్షన్‌ను ప్రయోగించాల్సిందిగా ఇటీవల కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టంలోని రెండవ సెక్షన్‌ కింద ప్రభుత్వాధికారులకు ప్రత్యేక అధికారాలు సిద్దిస్తాయి. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రేవులు, విమానాశ్రయాలు, రైల్వే, బస్సు స్టేషన్లలోనే కాకుండా ఆయా ప్రయాణ సాధనాల్లో ప్రయాణికులను తనిఖీ చేయవచ్చు, వారికి నిర్బంధంగా వైద్య పరీక్షలు నిర్వహించవచ్చు. నిర్బంధ శిబిరాలకు తరలించవచ్చు. వైరస్‌ బాధితుల చికిత్స విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవచ్చు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘించిన వ్యక్తులపై ఐపీసీ (1860)లోని 188వ సెక్షన్‌ కింద శిక్షలు విధించవచ్చు. ఆరు నెలల జైలు లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇతర సముచిత శిక్షలు విధించే హక్కు సంబంధిత మేజిస్ట్రేట్లకు ఉంటుంది. (కరోనా నిర్థారణ పరీక్షకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?)